హైదరాబాద్, నవంబర్14(రాజధాని న్యూస్) : తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక టి ఎస్ సి ఎస్ ఆడిటోరియంలో బాలల దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు, విశిష్ట అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం సృజనాత్మకత, వినోదం, స్ఫూర్తిదాయక అంశాలతో ఆద్యంతం ఆకట్టుకుంది.
ఈ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినోద్ కె. అగ్రవాల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అతిథులుగా హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, జాయింట్ రీప్లేస్మెంట్ నిపుణులు డాక్టర్ జి. వేద ప్రకాష్, స్నేహ బంగ్, ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత శ్యామ్ సుందర్జీ లోయా పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ సి ఎస్ సీఈఓ, కార్యదర్శి డాక్టర్ సుమన్ జైన్, ఉపాధ్యక్షులు నరేష్ రాఠీలతో పాటు బోర్డు సభ్యులు అలీమ్ బేగ్, మనోజ్ రూపాని, శివ్ రతన్, ఎండి. అమిన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపాలి అగర్వాల్, స్నేహ బంగ్ మాట్లాడుతూ చిన్నారుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేలా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు.
సెరిబ్రల్ పాల్సీని జయించిన కృష్ణ ప్రసంగం :
ఈ వేడుకలలో కుమారి కృష్ణ కమల్ కిశోర్ బంగ్ చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం తొమ్మిది నెలల వయసులోనే 'స్పాస్టిక్ డిప్లెజిక్ సెరిబ్రల్ పాల్సీ' వ్యాధి బారిన పడిన ఆమె, తన అకుంఠిత దీక్ష, పట్టుదలతో పాటు తల్లి డాక్టర్ మీరా బంగ్ అందించిన నిరంతర ప్రోత్సాహంతో శారీరక, విద్యాపరమైన ఎన్నో సవాళ్లను అధిగమించిన తీరును వివరించారు. ఆమె జీవన ప్రయాణం సభికులందరినీ కదిలించడంతో పాటు చిన్నారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వేడుకల లో భాగంగా చిన్నారుల కోసం నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, నృత్య ప్రదర్శనలు, కవితా పఠనం, గానం, ఆటలు, చిత్రలేఖన పోటీలు అలరించాయి. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడంతో కార్యక్రమం ఘనంగా ముగిసింది.
కామెంట్లు