హైదరాబాద్,నవంబర్14(రాజధాని న్యూస్ ) : 99వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్)కు భారతదేశ అధికారిక ఎంట్రీగా ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మరాఠీ చిత్రం 'గోంధళ్', నవంబర్ 13న భారతదేశవ్యాప్తంగా ఏడు భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా రీ-రిలీజ్ అయింది. ఒక మరాఠీ సినిమా హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రీ-రిలీజ్ కావడం భారతీయ సినీ చరిత్రలో ఇదే మొదటిసారని నిర్వాహకులు పేర్కొంన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సంతోష్ దవాఖర్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో 25 నిమిషాల నిడివి గల సింగిల్ టేక్ (ఒకే షాట్) సన్నివేశం ప్రధాన ఆకర్షణగా నిలిచిందన్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా 'గోంధళ్' రికార్డు సృష్టించిందన్నారు. ఈ సినిమాకు పద్మవిభూషణ్, సంగీత మాంత్రికుడు ఇళయరాజా సంగీతం అందించడంతో పాటు, హృదయాలను హత్తుకునే "చందన" అనే పాటకు స్వయంగా సాహిత్యం కూడా అందించడం విశేషం అని అన్నారు.
అంతర్జాతీయ ప్రశంసలు : 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలలో సంతోష్ దవాఖర్ ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక 'సిల్వర్ పీకాక్' అవార్డును గెలుచుకున్నారన్నారు. ఈ చిత్రాన్ని చూసిన ఫెస్టివల్ జ్యూరీ సభ్యులు "నిజ జీవితంలో జరిగే ఒక షేక్స్పియర్ కథలా ఉంది" అంటూ ప్రశంసల వర్షం కురిపించారని పేర్కొన్నారు . ఈ సందర్భంగా దర్శకుడు సంతోష్ దవాఖర్ మాట్లాడుతూ.. "గోంధళ్ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు; తరాల నాటి సంస్కృతి, ప్రజలు, సంప్రదాయాల కలయిక. మన మూలాలను, సంస్కృతిని ఖండాంతరాలకు తీసుకెళ్లడానికి ఆస్కార్ వంటి అంతర్జాతీయ వేదికలు ఎంతో తోడ్పడతాయి" అని ఆనందం వ్యక్తం చేశారు. దవాఖర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సంతోష్ దవాఖర్, దీక్షా దవాఖర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఇషితా దేశ్‌ముఖ్, కిషోర్ కదమ్, యోగేష్ సోహాని, నిషాద్ భోయిర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
కామెంట్లు