పంజాగుట్ట ఇర్రంమంజిల్లో విషాదం
- ఆర్టీసీ బస్సు ఢీకొని ఆపరేషన్ మేనేజర్ దుర్మరణం
పంజాగుట్ట,నవంబర్14 ( రాజధాని న్యూస్ ) : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇర్రంమంజిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పంజాగుట్ట పోలీస్ లు తెలిపిన వివరాలు ప్రకారం పోలీసులు అల్వాల్‌కు చెందిన కొండ్ర ప్రశాంత్ (31) పంజాగుట్టలోని 'ఫాస్ట్ లాజిస్టిక్స్' సంస్థలో ఆపరేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రశాంత్ తన యాక్టివా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఇర్రంమంజిల్ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో కోఠి నుంచి పటాన్చెరువు వైపు వెళ్తున్న బర్కత్‌పురా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టిజి 09 జెడ్ 0503) మెట్లను ప్రశాంత్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో తలకు, శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ఎన్. శేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు .
కామెంట్లు